ప్రభుత్వంలో అతికీలకమైన రెవెన్యూశాఖకు బాధ్యత వహిస్తున్న మంత్రి ధర్మా న ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లాలో పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నారు. 2004 రెవెన్యూమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ధర్మాన అనేక అక్రమాలకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. శ్రీకాకుళం పట్టణంలో మున్సిపల్ స్థలం ఆక్రమణ నుంచి తన కుమారుడు రామమనోహరనాయుడు గ్రానైట్ క్వారీకి, పట్టణశివారులో తన బంగ్లాకు ఉపాధి నిధులతో రోడ్డు వేయించుకున్నారనే అరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా సీతంపేట మండలం పులిపుట్టి పంచాయతీ పరిధిలో కన్నెధార కొండల్లోని తెల్ల గ్రానైట్ నిక్షేపాలను తన కుమారుడికి కట్టబెట్టడానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు, గిరిజన, ప్రజా సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి.
కన్నెధార కొండలపై ధర్మాన కుమారుడి కన్ను పడిన విషయాన్ని ఆంధ్రజ్యోతి తొలిసారిగా గత ఏడాది నవంబర్ 19న 'ఆదివాసీల గుండెల్లో గ్రానైట్ చిచ్చు - పావులు కదుపుతున్న మంత్రి కుమారుడు' అనే శీర్షికతో వెలుగులోకి తెచ్చింది. అప్పట్లో విపక్షాలు ఈ విషయంపై మౌనం వహించడంతో అనుకున్నంతా అయింది. ఎంతో విలువైన తెల్లగ్రానైట్ క్వారీ ధర్మాన తనయుడు రామ్‌మనోహర్‌నాయుడు హస్తగతం అయ్యింది. ఈ గ్రానై ట్ మైనింగ్ లీజుకోసం 19 మంది మూడేళ్ల క్రితమే దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు ఆ దరఖాస్తులను పక్కనపెట్టి ఈ ఏడాది మే7న దరఖాస్తు చేసుకున్న రామ్‌మనోహర్‌నాయుడుకు చెందిన వర్జిన్ రాక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు.
దరఖాస్తు చేసుకున్న స్వల్పవ్యవధిలోనే 15 హెక్టార్ల విస్తీర్ణంలో తవ్వకాలకు అనుమతులు మంజూరు చేయడం విశేషం. నిజానికి కన్నెధార కొండపై 289 సర్వే నెంబర్‌లో సీతంపేట, కొత్తూరు మండలాలకు చెందిన 283 మంది గిరిజనులకు 2008లోనే నాలుగో విడత భూపంపిణీలో భాగంగా పట్టాలు ఇచ్చారు. వారికి ఇంతవరకూ ఆ భూమిని అప్పగించలేదు. మంత్రి ధర్మాన కుమారుడి గ్రానైట్ మైనింగ్ కోసం అదే సర్వే నెంబర్‌లో భూమిని అప్పగించడం దుమారం రేపుతోంది. పంచాయతీ అనుమతులు లే కుండానే సుమారు 50 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ నిక్షేపాలను వర్జిన్ రాక్ సంస్థకు అప్పగించడం వెనుక మంత్రి హస్తం వుందన్న విషయం స్పష్టమవుతోంది.
జిల్లాలో థర్మల్, అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణాలతో అభివృద్ధిని ఆహ్వానిస్తున్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎప్పటికప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో గతనెల 14న సోంపేటలో జరిగిన థర్మల్ ఉద్యమంలో ఇద్దరు అమాయకులు ప్రాణాలు వదిలారు. ఇతర జిల్లాల్లో మంత్రులు థర్మల్ పవర్ ప్లాంట్‌ల నిర్మాణాలపై విముఖత చూపితే అందుకు భిన్నంగా ధర్మాన ప్రసాదరావు వ్యవహరిస్తుండడం పలుసందేహాలకు తావిస్తోంది. జిల్లాలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ల యాజమాన్యాలతో మంత్రి కుమ్మక్కై వందల కోట్ల రూపాయలు వెనుకేసుకున్నారన్న ఆరోపణలను ఆయన వైఖరి బలపరుస్తోంది. మంత్రి చుట్టూ ముసురుకుంటున్న వివాదాలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఆయన నేతృత్వంలో రెవెన్యూ శాఖ కూడా అవినీతికి నిలయంగా మారిందని కలెక్టర్లతో సహా ఆర్డీవోలు, రెవెన్యూ సిబ్బంది అక్రమార్జనలో మునిగితేలుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ధర్మానను మంత్రివర్గం నుంచి తప్పించి ఈ వ్యవహారాలన్నింటిపై ఉన్నత స్ధాయి దర్యాప్తు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

No comments:
Post a Comment